ఇకపై బిజెపితో పొత్తుపెట్టుకోవడం, కలిసి పనిచేయడం జరగదుః సీఎం నితీశ్‌

Will work with samajwadis: Nitish Kumar vows never to ally with BJP again

పాట్నాః బీహార్ సిఎం నితీశ్‌ కుమార్‌ బిజెపిపై విమర్శలు గుప్పించారు. మరోసారి బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్‌ స్పష్టం చేశారు. కేంద్రంలో అహంకారంతో కళ్లు మూసుకుపోయిన నాయకులు పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. వారు దేశాభివృద్ధి కోసం కాకుండా సమాజంలో చీలికలు సృష్టించేందుకు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన జీవితంలో మరోసారి బిజెపితో పొత్తుపెట్టుకోవడం గానీ, కలిసి పనిచేయడంగానీ జరగదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిచేయడానికి సోషలిస్టు భావజాలం కలిగినవారితో కలిసి ముందుకు వెళ్తానని వెల్లడించారు.

బిజెపి అగ్రనాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌ కృష్ణ అద్వాని, మురళీ మనోహర్‌ జోషి వంటి నాయకులను ఆయన గుర్తుచేసుకున్నారు. వారంతా దేశం కోసం పనిచేశారన్నారు. ఇప్పుడు పార్టీమొత్తం అహకారులతో నిండిపోయిందని తెలిపారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో తాను మూడు శాఖలకు బాధ్యతలు నిర్వర్తించానన్న విషయాన్ని ప్రస్తుత బిజెపి నాయకత్వం మరచిపోయిందని చెప్పారు. పార్టీ అధినాయకులుగా ఉన్నవారు పూర్తిగా అహకారంతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/