నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్న చంద్రబాబు

ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళి అర్పించనున్న బాబు

Chandrababu will inaugurate the centenary celebrations of NTR in Nimmakuru

నిమ్మకూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మచిలీపట్నంలో నిన్న బహిరంగ సభ ముగిసిన తర్వాత చంద్రబాబు నేరుగా నిమ్మకూరుకు చేరుకుని అక్కడే బస చేశారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే నిమ్మకూరుకు చేరుకున్నారు.

కాసేపట్లో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు చంద్రబాబు పూలమాలలు వేసి, నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా నిమ్మకూరు గ్రామస్తులకు చంద్రబాబు బట్టలు పెట్టనున్నారు. అలాగే, తమ ఇంటి అల్లుడైన చంద్రబాబుకు నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసినిలు బట్టలు పెట్టనున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమం సందర్భంగా నిమ్మకూరు గ్రామం మొత్తం పసుపు తోరణాలు, టిడిపి జెండాలతో నిండిపోయింది. దివంగత ఎన్టీఆర్, చంద్రబాబుల భారీ ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత చంద్రబాబు గుడివాడకు బయల్దేరనున్నారు. గుడివాడలో చంద్రబాబు భారీ రోడ్ షోను నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.