నిమ్స్‌లో ఖమ్మం ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కెటిఆర్‌

Minister KTR visited Khammam accident victims in Nims

హైరదబాద్ః ఖమ్మం జిల్లా చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే బాధితులను బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్‌ పరామర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న మంత్రి కెటిఆర్‌‌.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కెటిఆర్‌కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు సూచించారు.

అనంతరం మీడియాతో మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. చీమలపాడు ఘటన దురదృష్టకరమని చెప్పారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.