మంగళగిరిలో ఉద్రికత్త

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందమూరి బాలకృష్ణ‌ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో అన్న క్యాంటిన్లను ప్రారంభించాలని టీడీపీ నాయకులు భావించారు. ఇందుకోసం అన్న క్యాంటీన్‌ షెడ్‌ను నెలకొల్పారు. దీనిని పోలీసులు ,మున్సిపల్‌ సిబ్బంది రాత్రికి రాత్రే బుల్‌డోజర్ల సహాయంతో తొలగించారు. దీంతో మున్సిపల్‌ సిబ్బంది వైఖరిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటిన్‌ను తొలగించినప్పటికీ అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్న పలువురు నాయకులు, కార్యకర్తలు మంగళగిరి బస్టాండ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదల ఆకలి తీరుస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందని విమర్శించారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్దే ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పరిమితికి లోబడి కార్యక్రమం చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. తొలగిన చోటే టెంట్ వేసి అన్నదానాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని , కార్యకర్తలను అక్కడి నుండి పంపించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ , కార్యకర్తలు మాత్రం పోలీసులను అడ్డు తొలగించుకొని అన్నదానం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం మంగళగిరి లో టెన్షన్ వాతావరం చోటుచేసుకుంది.