సభలో స్వామీజీ మాట్లాడుతుండగా మైక్ లాక్కున్న సీఎం బొమ్మై

బెంగళూరుః కర్ణాటక రాజధాని బెంగళూరులోని మహదేవపురలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్మాత్మిక గురువు ఈశ్వరానందపురి స్వామీజీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ ప్రసంగిస్తూ బెంగళూరులోని పౌర సమస్యలను లేవనెత్తారు. ఇటీవల బెంగళూరును వరదలు ముంచెత్తాయని, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారిని ఆదుకోవడంలో బెంగళూరు నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయని, ఈ సమస్యకు పాలకులు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉన్నదని ఈశ్వరానంద వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏదో అనబోతుండగానే పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆయన నుంచి మైకును లాక్కున్నాడు. బెంగళూరు వరదల సమస్యకు ఎవరో ఒక్కరు మాత్రమే శాశ్వత పరిష్కారం చూపలేనని అన్నారు. ఆ బాధ్యత అందరిపైన ఉన్నదని, అయినా వరదల సమయంలో సహాయక చర్యల కోసం తాము నిధులు విడుదల చేశామని చెప్పారు.
అయితే, స్వామీజీ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి ఆయన నుంచి మైకు లాక్కుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు వస్తున్నాయి. స్వామీజీ ఉన్నమాట చెబుతుంటే ముఖ్యమంత్రికి అంత అసహనం దేనికని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/