పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఫోన్

పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన టెన్షన్ వాతావరణానికి దారితీసింది. శుక్రవారం వైస్సార్సీపీ మంత్రుల కార్ల ఫై జనసేన కార్యకర్తలు దాడి చేసారని , ఈ దాడి చేయించింది పవన్ కళ్యాణ్ అని వైస్సార్సీపీ నేతలు ఆరోపిస్తూ వారి ఫై కేసులు పెట్టారు. పోలీసులు వందకు మందికి పైగా జనసేన కార్య కర్తలు అరెస్ట్ చేసారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ను విశాఖ ను వదిలి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేసారు. ప్రస్తుతం పవన్ వైజాగ్ నోవాటెల్ ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు ..పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడారు.

పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై ఆయన పవన్ తో మాట్లాడారు. వందలమంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందని, జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు. ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ… తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతల అరెస్టులు తదితర అంశాలపై చంద్రబాబుకు వివరించారు. పవన్ కు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు, అధికార పక్షం పోలీసులతో పాలన చేయాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదని అన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు.