రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం

Chandra babu Naidu
Chandra babu Naidu

తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 73 వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్బంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపై ప్రజా క్షేత్రంలోనే ఉంటానంటూ సంకేతాలు పంపారు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామం లో పర్యటిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు గ్రామం చేరుకుని స్థానిక ప్రజలతో సమావేశం అవుతారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రోడ్‍షోలు, బహిరంగ సభలతో సమస్యలపై పోరాటాలు చేయాలని భావిస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేసేలా చంద్రబాబు కార్యాచరణ రూపొందించుకున్నారు. ధరల మోత, పన్నుల భారంతో ప్రజలు పడుతున్న అవస్థలపై పోరాటంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ… శ్రేణులను మమేకం చేయనున్నారు. మే మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో పర్యటనలు మొదలుకానున్నాయి. మహానాడు తర్వాత ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున… ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రోడ్డు షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలా, గ్రామ సభలు నిర్వహించాలా అనే అంశంపై పార్టీ నాయకులతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. చంద్రబాబు ప‌ర్యట‌న‌లకు సమాంతరంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్ కూడా ప్రజల మధ్య ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి పాదయాత్ర ద్వారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం.