రాష్ట్ర వ్యాప్త టూర్ కు సిద్దమవుతున్న చంద్రబాబు ..

Chandrababu is ready for statewide tours

టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడాది పాటు ప్రజల మధ్య తిరగబోతున్నాడు. అవును ఏడాది టూర్ కు చంద్రబాబు సిద్దమవుతున్నాడు. ఏడాది పాటు 26 జిల్లాలను చంద్రబాబు చుట్టేయబోతున్నారు. ఈ నెల మూడో వారం చంద్రబాబు టూర్​ మొదలుకాబోతుంది. జిల్లా పర్యటనల్లో.. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు చేపట్టాలని నిర్దేశించారు.

ఈ నెల 15 నుంచి చంద్రబాబు తొలివిడత జిల్లా పర్యటన మొదలుచేయబోతున్నారు. 15న చోడవరంలో జిల్లా మహానాడులో పాల్గొననున్నారు. అందులో భాగంగా.. బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈనెల 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. ఈనెల 17న చీపురుపల్లిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా చంద్రబాబు పర్యటన సాగనుంది. అటు జిల్లాల పర్యటనలు, ఇటు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా షెడ్యూల్ రూపొందించారు.

ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇప్పటి నుండే చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త టూర్ కు ప్లాన్ చేసారు. మరోపక్క ఇప్పటి నుండే టిడిపిలోకి వలసలు మొదలుకాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయం నాటికీ వలసలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.