రావెల కిషోర్ బాబు మళ్లీ టీడీపీలో చేరనున్నారా?

నిన్న చంద్రబాబును కలిసిన రావెల

అమరావతి: మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తిరిగి సొంత గూడు టీడీపీకి చేరబోతున్నారనే వార్తలు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి. మరోవైపు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కలవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఆయన టీడీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. గత ఎన్నికల్లో రావెల జనసేన నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేనను వీడి బీజేపీలో చేరారు.

ఉన్నత విద్యావంతుడైన రావెల కిశోర్ బాబు ఐఆర్ఎస్ అధికారిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయనకు ప్రాధాన్యతను ఇచ్చిన చంద్రబాబు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో పాటు మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.

అయితే, మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో 2018 కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. పర్యవసానంగా అసంతృప్తికి గురైన రావెల టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అనంతరం బీజేపీలో చేరి, కొనసాగుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/