టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై చంద్రబాబు ఫైర్

జగన్ ఆటలు సాగనివ్వబోమన్న చంద్రబాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైస్సార్సీపీ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. కుప్పం కార్పొరేషన్ ఎన్నికల్లో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన టీడీపీ నేతలు అమర్నాథ రెడ్డి, పులివర్తి నానిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. హోటల్ లో భోజనం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. టీడీపీ నేతలను భయపెట్టి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు జగన్ ప్లాన్ వేశారని ఆరోపించారు. జగన్ ఆటలను సాగనివ్వబోమని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. పోలీసుల అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు పోటీ చేయకుండా కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైస్సార్సీపీ తో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని, నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారని మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా కుప్పంలోని ఓ హోటల్ లో బస చేస్తున్న ఆయన్ను అర్ధరాత్రి 12.30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రిపూట నోటీసులిస్తారా? అంటూ పోలీసులను ఈ సందర్భంగా రామానాయుడు నిలదీశారు. నోటీసులివ్వాలనుకుంటే మధ్యాహ్నం ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. గంట తర్వాత ఆయన తలుపులు తీశారు. అనంతరం 1.30 గంటలకు ఆయన్ను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/