ఫ్రాన్స్ అధ్యక్ష భవనానికి పార్శిల్‌లో తెగిన వేలు

Chopped Fingertip Found In Package Delivered To French President’s Official Residence

పారిస్‌ః ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అధికారిక నివాసంలో తెగిన వేలి పార్శిల్ కలకలం సృష్టించింది . ఈ వారం మొదట్లో మెక్రాన్ అధికారిక నివాసమైన ఎలిసీ ప్యాలెస్ కు వచ్చిన పార్శిల్ లో తెగిన వేలిని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వేలు.. ప్యాకేజీని పంపించిన వ్యక్తిదే అయి ఉంటుందని పారిస్ ప్రాసిక్యూటర్ అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఫ్రాన్స్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. గత నెల పోలీసుల కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించడంతో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వేలాది మంది ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ భవనాలు, వాహనాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. దాదాపు కొన్ని వారాలపాటు ఈ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష భవనానికి తెగిన వేలితో పార్శిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది.