ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబుకు లేదు – సజ్జల

ఏపీలో పొత్తుల వ్యవహారం వేడి పెంచుతుంది. తాజాగా కర్నూల్ పర్యటన లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బిజెపి పొత్తులు పెట్టుకుంటాం అని చెప్పకనే చెప్పడం తో వైసీపీ నేతలు వరుస పెట్టి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పొత్తుల వ్యవహారం ఫై స్పందించారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని గద్దె దించే కుట్ర జరుగుతోందని.. విపక్షాలవి పగటి కలలుగా వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేనకు రాజకీయ అవసరాలే తప్ప.. ప్రజా ప్రయోజనాలు వాళ్లకు అవసరం లేదన్నారు.

చంద్రబాబు, పవన్‌కు మధ్య ఎప్పటి నుంచో అవగాహన ఉందని.. అసలు పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని.. బీజేపీతో పొత్తు ఉంటూనే.. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చెబుతున్న వ్యూహం అంటే సినిమాల్లో రెండు రీళ్లలో నడిపేదా అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు త్యాగం చేస్తానంటున్నారు.. లీడ్ చేస్తామంటారు.. పవన్ జనసేన ప్రభుత్వం వస్తుంది.. సీఎంగా తానే వస్తానంటారు.. చంద్రబాబు త్యాగం చేయడం అంటే తాను సీఎం పదవి త్యాగం చేసి పవన్ ను తెచ్చుకుంటారా. చంద్రబాబును సీఎంను చేయడానికి పవన్ ప్రిపేర్డ్‌గా ఉన్నారా’ అంటూ ప్రశ్నించారు. లేకపోతే రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా అన్నారు. చంద్రబాబు స్క్రీన్ ప్లే,డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును అధికారంలో ఎలా కూర్చోబెట్టాలో పవన్ చూస్తున్నారని.. జగన్‌ను గద్దె దించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.