ఇది ఒక ప్రత్యేకమైన సైనిక చర్య : పుతిన్

ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు దాడులు చేస్తోందో తెలిపిన పుతిన్

మాస్కో: నేడు రష్యా విక్టరీ డే ఉత్సవాలు జరుపుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమిని పురస్కరించుకుని ప్రతి ఏడాది మే 9న రష్యా విక్టరీ డే జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో, నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విక్టరీ డే నాడు ఆయన ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, పుతిన్ కొద్దిసేపటి కిందట తన ప్రసంగం వెలువరించారు. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించలేదు కానీ, ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు దాడులు చేస్తోందో ఆయన వివరించారు.

నియో నాజీలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ మాతృభూమిని రక్షించడం కోసమే ఈ సైనిక చర్య అని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లో పాశ్చాత్య దేశాలు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఆయా దేశాల విధానాలకు ప్రతిచర్యగానే రష్యా బలగాలు ఉక్రెయిన్ లో పోరాటం సాగిస్తున్నాయని పుతిన్ వివరించారు. ఇది మాతృభూమి కోసం పోరాటం అని అభివర్ణించారు. ఉక్రెయిన్ సమగ్రతను, భద్రతను పరిరక్షించడమే రష్యా సేనల దాడుల వెనుక ఉద్దేశం అని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పుతిన్ ఉక్రెయిన్ పై తాము చేస్తున్నది యుద్ధం అని చెప్పకుండా, ఇది ఒక ప్రత్యేకమైన సైనిక చర్య అని వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/