ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదంపై మంత్రి కేటీఆర్

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. మంగళవారం ఉదయం క‌రీంన‌గ‌ర్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు, విజ్ఞాన్ స్కూల్‌కు చెందిన బ‌స్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో స్కూల్ బస్సులోని 20 విద్యార్థులకు గాయాలు కాగా..ఆర్టీసీ బస్సులో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద విషయం తెలిసి బ‌స్సులోని తమ పిల్ల‌లకు ఏమైందో అని భ‌యంతో త‌ల్లిదండ్రులు, స్కూల్ యాజ‌మాన్యం సంఘ‌ట‌నా స్థ‌లానికి ప‌రుగులు తీశారు.

పిల్ల‌ల‌కు తీవ్ర గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. నొప్పితో ఏడ్చిన చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా తీశారు. డీఈవో రాధాకిషన్ ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే ఈ ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద‌రాబాద్‌కు తరలించాలని సూచించారు.