రాష్ట్రంలో ఘనంగా రంజాన్‌ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చార్మినార్‌, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో అధ్యాత్మిక వాతావరణం వెల్లవిరిసింది. ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న ఈద్గాలో మంత్రి మహమూద్‌ అలీ, సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌‌, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు, సూర్యాపేట మంత్రి జగదీశ్‌ రెడ్డి, బండ ప్రకాశ్‌, నిర్మల్‌లోని చించోలి-బి సమీపంలోని ఈద్గాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక రంజాన్ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవ చింతన స్ఫూర్తితో రంజాన్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తారు. అల్లా దీవెనలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు