టీడీపీ చేస్తున్న పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలి

జ‌గ‌న్ స‌ర్కారు బాదుడుపై ఏపీ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు
జ‌గ‌న్ బాదుడుతో ప్ర‌తి కుటుంబంపై ఏటా ల‌క్ష భారం..చంద్ర‌బాబు

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జగన్ స‌ర్కారు తీరుపై విరుచుకుప‌డ్డారు. బాదుడే బాదుడు విధానంలో సాగుతున్న జ‌గ‌న్ స‌ర్కారు మెడ‌లు వంచేందుకు టీడీపీ కొన‌సాగస్తున్న పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని చంద్ర‌బాబునాయుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. వైస్సార్సీపీ స‌ర్కారు దోపిడీని ప్ర‌శ్నించాల‌ని కూడా ఆయ‌న సూచించారు.

గ‌తంలో సంతోషంగా సాగిన రాష్ట్ర ప్ర‌యాణం తాజాగా సంక్షోభం దిశ‌గా సాగుతోంద‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చెత్త ప‌న్నులు,పెంచిన విద్యుత్ చార్జీలు, ఆకాశాన్నంటుతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌ల జేబులు గుల్ల అవుతున్నాయ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఇసుక‌, మ‌ద్యం లాంటి వాటితో జ‌రిగే దోపిడీ దీనికి అద‌న‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ త‌ర‌హా వైసీపీ స‌ర్కారు విధానాల‌తో ప్ర‌తి కుటుంబంపై ఏడాదికి హీనప‌క్షం రూ.1 ల‌క్ష భారం ప‌డుతోంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ బాదుడుతో ప్ర‌జ‌లు విల‌విల్లాడిపోతున్నార‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాను చేసే అప్పుల కోసం ప్ర‌జ‌ల జేబుల‌ను ఖాళీచేస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల నుంచి పిండిన దాంట్లో 10 శాతాన్ని ప్ర‌జ‌ల‌కు ఇచ్చి మిగిలిన 90 శాతాన్ని జ‌గ‌న్ త‌న జేబులో వేసుకుటంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ దోపిడీని ప్ర‌శ్నించాల‌న్న చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వ ప‌న్నులు, బాదుడుపై టీడీపీ చేస్తున్న పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/