అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్‌ దూరం

congress-to-skip-ayodhya-ram-mandir-pran-pratishtha-event

న్యూఢిల్లీః అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖలను ఆహ్వానిస్తున్నది. అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్‌ను సైతం ట్రస్ట్‌ ఆహ్వానించింది.

ఆలయ ప్రారంభోత్సవానికి రావడం లేదని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేశ్‌ తెలిపారు. అయోధ్య ట్రస్ట్‌ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తిరస్కరించారు. మతం అనేది వ్యక్తిగత అంశమని.. రామాలయాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్‌ ఆరోపించింది.

అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. ఎన్నికల కోసం అసంపూర్ణ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని విమర్శించింది. ‘2019 సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరాముడిని గౌరవించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ.. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి స్పష్టంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఈవెంట్‌ ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించారు’ అని కాంగ్రెస్‌ పేర్కొంది.