మైఖేల్ ఫ్లిన్ ను క్ష‌మించిన ట్రంప్‌

2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణ

2017లో నేరాన్ని అంగీకరించిన మైఖేల్

Michael Flynn

వాషింగ్టన్‌: అధ్యక్షుడు ట్రంప్‌ త‌న వ‌ద్ద విధులు నిర్వ‌ర్తించిన మాజీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు మైఖేల్ ఫ్లిన్‌ను క్ష‌మించారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై జరిగిన విచారణలో తన తప్పును అంగీకరించిన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ కు క్షమాభిక్ష పెడుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ‘జనరల్ మైఖేల్ ఫ్లిన్ ను పూర్తిగా క్షమించేస్తున్నా.ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మీకు, మీ అద్భుతమైన కుటుంబానికి అభినందనలు మైఖేల్ ప్లిన్. నాకు తెలుసు. కృతజ్ఞతలతో నువ్విప్పుడు పార్టీ చేసుకుంటావని’ అని అన్నారు.

కాగా, రష్యా దౌత్యాధికారితో జరిపిన సంభాషణలపై ఎఫ్బీఐ విచారించగా, 2017లోనే ఫ్లిన్ తన తప్పును అంగీకరించారు. అయితే, ఆయనకు ఇంకా శిక్ష ఖరారు కాలేదు. తన నేరాంగీకార పిటిషన్ ను ఉపసంహరించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఫ్లిన్, ప్రాసిక్యూటర్లు తన హక్కుల గురించి పట్టించుకోలేదని, బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేశారని కూడా ఆరోపించారు. కాగా, ట్రంప్ అధికారంలో ఉన్న కాలంలో ఆఫ్ఘన్ లో యుద్ధ నేరాలకు పాల్పడిన అమెరికన్ సైనికులకు, చట్ట విరుద్ధంగా దేశంలోకి విదేశీ పౌరులను అనుమతించారని ఆరోపణలను ఎదుర్కొన్న ఆరిజోనా పోలీసు అధికారి జోయ్ అర్పాయో తదితరులకూ ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/