జగన్ చొక్కా మడత పెడితే, మేం కుర్చీ మడత పెడతాం – బాబు మాస్ వార్నింగ్

జగన్ చొక్కా మడతపెడితే, టీడీపీ శ్రేణులు, జనసైనికులు కుర్చీ మడతపెట్టి అతనికే కుర్చీ లేకుండా చేస్తారని చంద్రబాబు మాస్​ వార్నింగ్​ ఇచ్చారు. విజయవాడలో ”విధ్వంసం” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేశ్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే తాను, పవన్ కల్యాణ్ పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు జాతి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలన్నదే తమ ఇద్దరి ఆకాంక్ష అని చెప్పారు. తిరగపడతారో, బానిసలుగా ఉండిపోతారో తేల్చుకోవాల్సింది ప్రజలే అన్నారు. దేవతలు కూడా దుర్మార్గుడి విధ్వంసం నుంచి అమరావతిని కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై విధ్వంసం పేరిట పుస్తకం రావటం దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమమన్నారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి ఈ పుస్తకం ధర్మాగ్రహమని తెలిపారు. 3 రాజధానుల విధ్వంసం చాలదన్నట్లు సిగ్గు, ఎగ్గూ లేకుండా నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ చేసిన అరాచకాలకు విధ్వంసం కంటే పెద్ద పేరు ఏం పెట్టాలో అర్ధం కావట్లేదని విమర్శించారు.

దేశంలో ఇదే తొలిసారి. పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం మొదటిసారిగా చూస్తున్నా. నా మనసులోనే కాదు 5 కోట్ల ప్రజల మనసులో ఉంది విధ్వంసం పుస్తకంలో రాశారు. సైకో పాలనలో మన పిల్లల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారంటే పాలన ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. 30వేల ఎకరాలు 33వేల మంది రైతులు రాజధాని కోసం భూమి ఇచ్చారంటే అది త్యాగం. రాష్ట్రం బాగుపడాలని స్వచ్చందంగా ముందుకు వచ్చి 30వేల ఎకరాలు ఇచ్చారు. అమరావతిలో రాజధాని కట్టి ఉంటే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి ఉపాధి దొరికేది. అమరావతి నిర్మించి ఉంటే 2 లక్షల కోట్లు వచ్చేవి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ పుస్తకంలో ఉన్న చాలా సంఘటనలకి నేను సాక్షిని. వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అన్న మాటకు ఈ పుస్తకం కారణం. ఎన్నికలు అయిన వెంటనే కూల్చివేతలతో వైసీపీ పాలన మొదలు అయింది. అమరావతి ప్రజలు శరీరం మీద దెబ్బలు చూస్తే కన్నీళ్లు వచ్చాయి. ఆడపిల్లల మిస్సింగ్ మీద నా మాటలు వేరుగా అర్ధం చేసుకుంటున్నారు. వాలంటీర్ సేకరించిన డేటా హైదరాబాద్ లో ఒక ప్రవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు అని అడిగా.. వాలంటీర్ అందరూ చేసారని నేను అనలేదు కొంతమంది గురించి అన్నాను. చివరికి 33 వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని జగన్ ఒప్పుకున్నారు. క్లాస్ వార్ గురించి జగన్ మాట్లాడే స్థాయి లేదు. క్లాస్ వార్ మీద కూడా ఒక పుస్తకం సురేష్ గారు రాయాలి’’ అని అన్నారు.