కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎంపీ బండి సంజయ్ తెలిపారు. 61.80 కిలోమీటర్ల రైల్వే లైన్​ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.1.54 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. భూసేకరణ, ట్రాక్, స్టేషన్ల నిర్మాణ పనులు చకచకా పూర్తయితే మరికొద్ది సంవత్సరాల్లోనే కరీంనగర్ నుంచి హనుమకొండ జిల్లాకు రైలు కూత పెట్టనుందని తీపి కబురు అందించారు.

కరీంనగర్– హసన్ పర్తి రైల్వే లైన్​ నిర్మాణానికి సంబంధించి 2013లోనే సర్వే చేసినప్పటికీ.. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ ఈ లైన్​ నిర్మాణ ప్రస్తావన ఉంది. సుమారు 62 కిలోమీటర్ల మేర ఉండే ఈ లైన్​పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుంది. ప్రస్తుతం కాజీపేట జంక్షన్ నుంచి ముంబై వెళ్లాలంటే సికింద్రాబాద్ మీదుగా వయా నిజామాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఈ లైన్​పూర్తయితే కరీంనగర్ మీదుగా ముంబై వెళ్లొచ్చు.