రామగుండం-మణుగూరు రైల్వే కోల్ కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామగుండం, మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 25 ఏండ్లుగా హామీలు, సర్వేలు, ప్రతిపాదనలు, పరిశీలనలతో కాగితాలకే పరిమితమైన రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌కు బుధవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో అత్యంత రద్దీగా ఉండే కాజీపేట-బల్లార్షా మార్గంలో మూడో లైన్‌ను నిర్మించినప్పటికీ సరుకు రవాణా విషయంలో మాత్రం గంటల కొద్దీ జాప్యం జరుగుతున్నది. ఫలితంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

దీనికి పరిష్కారంగా సింగరేణి గోదావరి పరీవాహక ప్రాంతాలైన పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కలుపుతూ కోల్‌కారిడార్‌ నిర్మించాలని డిమాండ్‌ తెరపైకి వచ్చింది. 25 ఏండ్ల క్రితం 1999లోనే పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ మీదుగా మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్రం సర్వేలు, భూ పరీక్షలు చేసి కోల్‌కారిడార్‌గా పేరు పెట్టింది. గతంలో రూ.10కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ముందుకుసాగలేదు. కానీ ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,911కోట్లుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది.