మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న అలీ

ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు ఆలీ..చోడవరం నియోజకవర్గంలో స్వయంభు గౌరేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గౌరీశ్వరాలయంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను అలీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చానని .. రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు ధర్మశ్రీ ఎమ్మెల్యేగా ఉన్నారని.. మళ్లీ ఇప్పుడు వచ్చానని.. ఇప్పుడు ప్రభుత్వ విప్‌గా ఉన్నారని , ఈసారి తాను వచ్చేసరికి మంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. ఈ సందర్బంగా అలీని ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక మైనారిటీ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

మరోపక్క దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని శివాలయాలు శివస్మరణతో మారుమోగిపోతున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులు చూస్తున్నారు.