సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసిన కేంద్రం

Onions
Onions

కేంద్రం సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశానికి తాకడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఉల్లి ధరలు కూడా భారీగా పెరగనున్నాయని..టమాటా ధర మాదిరి ఉల్లి ధర కూడా కేజీ రూ.100 లకు చేరుకుంటుందనే వార్తలు ప్రచారం అవుతుండడం తో సామాన్యులు భయపడుతున్నారు. అయితే దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 3 లక్షల టన్నుల ఉల్లి గడ్డలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాది ఉల్లి బఫర్ స్టాక్‌తో పోలిస్తే.. ఇది ఏకంగా 20 శాతం ఎక్కువ. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ కింద కొనుగోలు చేసింది.

సరఫరా తక్కువగా ఉన్న సీజన్‌లో ధరలు పెరగకుండా చూడటానికి బఫర్ స్టాక్ ఉపయోగిస్తారు. ప్రైస్ స్టెబిలైజేష్ ఫండ్ ద్వారా బఫర్ స్టాక్‌ను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఉల్లిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా బాటా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రబీ సీజన్‌లో పండించిన ఉల్లిని కేంద్రం బఫర్ స్టాక్ కింద కొనుగోలు చేసింది. అలాగే ఖరీఫ్ ఉల్లి సాగు ప్రారంభం అయ్యింది. అక్టోబర్‌లో ఉల్లి పంట మార్కెట్‌లోకి రానుంది. పండుగ సీజన్‌లో ఆకస్మిక ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఉల్లి ధరలతో ఇబ్బంది ఉండదని రోహిత్ సింగ్ తెలిపారు.