తెలుగోడా..తిప్పరా.. మీసం ‘నాటు నాటు ‘కు ఆస్కార్ అవార్డు

యావత్ తెలుగు ప్రజలు గర్వగా చెప్పుకునే సందర్భం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తొలి దక్షిణాది సాంగ్ గా నాటు నాటు నిలిచింది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న తెలుగు సినీ అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆనందం మాటల్లో చెప్పలేం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ సినిమాలో ‘అప్లాజ్’, బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మి అప్’, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని ‘దిస్ ఈజ్ లైఫ్’, టాప్ గన్ మావెరిక్ సినిమాలో ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలను వెనక్కి నెట్టి మరీ ‘నాటునాటు’ పాట ఆస్కార్ దక్కించుకుంది.

ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. దీనిపై యావత్ తెలుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. RRR టీమ్‌కి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అభినందనలను తెలియజేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ కూడా ఆర్ఆర్ఆర్ కావటమే విశేషం. పాటకు సంగీతాన్ని కంపోజ్ చేసిన కీరవాణి, పాటను రాసిన చంద్రబోస్ స్టేజ్ ఎక్కి అవార్డును అందుకున్నారు. స్టేజ్‌పై కీరవాణి యావత్ భారత అభిమానులకు ధన్యవాాదాలను తెలియజేశారు.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR మూవీలోని నాటు నాటు పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి డాన్స్ చేయటం విశేషం. ఈ పాటను రాజమౌళి 17 రోజుల పాటు చిత్రీకరించారు. వారం రోజుల పాటు పాటను రిహార్సల్ చేసి షూట్ చేశారు. 150 మంది డాన్సర్స్, 200 మంది యూనిట్ సభ్యులతో ఈ పాట చిత్రీకరణంతా సందడిగా సాగింది. కీరవాణి సంగీత సారథ్యం వహించిన ఈ పాటను చంద్రబోస్ రాయగా రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఈ మూవీ 24 మార్చి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.