ఆడబిడ్డ జన్మించడాన్ని అపురూపంగా భావిస్తున్నాం: చిరంజీవి

అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు

chiranjeevi-emotional-response-on-granddaughter-birth

హైదరాబాద్‌ః మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

బిడ్డ పుట్టడంతో అటు మెగా, ఇటు కామినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. రామ్‌చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. మెగా ప్రిన్సెస్ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు కుటుంబాల సభ్యులు నేటి ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి వెళ్లి రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, బిడ్డను ఆశీర్వదిస్తారని తెలిపింది.

మరోవైపు తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషంలో మునిగితేలుతున్నారు. ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాలిని చూసుకున్న చిరంజీవి… కాసేపటి క్రితం మళ్లీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనకు పలు ప్రశ్నలు వేశారు.

చరణ్ కూతురికి ఎవరి పోలికలు వచ్చాయంటూ అడిగిన ప్రశ్నకు బదులుగా… పోలికలు ఎవరివి వచ్చాయనే విషయాన్ని అప్పుడే చెప్పలేమని అన్నారు. మంగళవారం నాడు అమ్మాయి పుట్టిందని… ఆంజనేయస్వామిని తాము నమ్ముకున్నామని, ఆయనకు ప్రత్యేకమైన మంగళవారంనాడు ఆడబిడ్డ జన్మించడాన్ని తాము అపురూపంగా భావిస్తున్నామని చెప్పారు. అపోలో ఆసుపత్రి ఛైర్మన్ పీసీ రెడ్డిగారు (ఉపాసన తాత) దగ్గరుండి అన్ని రకాలుగా కేర్ తీసుకున్నారని, బెస్ట్ మెడికల్ టీమ్ ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎలాంటి రిస్క్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఉపాసనకు సుఖ ప్రసవం జరిగిందని వెల్లడించారు.