ఐక్యరాజ్య సమితికి లేఖ రాసిన సంజయ్ రౌత్

జూన్ 20ని ప్రపంచ ద్రోహుల దినంగా ప్రకటించండి..

Shiv Sena slams Sanjay Raut for seeking June 20 as ‘World Traitors Day’

ముంబయిః శివసేన (ఉద్ధవ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి రాసిన లేఖ సంచలనమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన వర్గాన్ని ప్రస్తావిస్తూ జూన్ 20ని ‘ప్రపంచ ద్రోహుల దినం’గా ప్రకటించాలని కోరుతూ ఐరాస కార్యదర్శి జనరల్ ఆంటోనియో గుటెరెస్‌కు లేఖ రాశారు. గతేడాది జూన్ 20న ఏక్‌నాథ్ షిండే సహా 40 మంది ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. పలు ఆసక్తికర పరిణామాల తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది.

ఈ నేపథ్యంలోనే జూన్ 20ని ద్రోహుల దినోత్సవంగా పరిగణించాలని కోరుతూ ఐరాసకు లేఖ రాశారు. ట్విట్టర్‌లో రౌత్ పోస్టు చేసిన లేఖ చక్కర్లు కొడుతోంది. జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టుగానే జూన్ 20ని ద్రోహుల దినోత్సవంగా గుర్తించాలని కోరారు. ఇలా చేయడం వల్ల ఆ రోజు ద్రోహులను ప్రపంచం గుర్తు చేసుకుంటుందని అన్నారు.