మరోసారి అవినాశ్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ

అవినాశ్ తండ్రి భాస్కరరెడ్డికి కూడా నోటీసులిచ్చిన అధికారులు

ys-avinash-reddy

అమరావతిః మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాశ్ ‌రెడ్డికి మరోమారు నోటీసులు జారీ చేసింది. గత రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఈ నెల 10న జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అలాగే, 12న జరిగే విచారణకు హాజరు కావాలంటూ ఆయన తండ్రి భాస్కరరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు.

అసలు అవినాశ్ రెడ్డి నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ముందస్తు కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్టు సీబీఐకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా మరోమారు నోటీసులు జారీ చేశారు. సీబీఐ నోటీసులపై స్పందించిన అవినాశ్ రెడ్డి .. తాను 10న విచారణకు హాజరవుతానని, తన తండ్రి ఈ నెల 12న కడపలో జరిగే విచారణకు హాజరవుతారని పేర్కొన్నారు.