వంట గ్యాస్ పై సబ్సిడీని పొడిగించిన కేంద్రం

పీఎంయూవై లబ్దిదారులకు సిలిండర్ పై రూ.200 తగ్గింపు

Govt extends Ujjwala Yojana LPG subsidy of Rs 200/gas cylinder for another year

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు శుభవార్త ప్రకటించింది. వంట గ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం అందుకుంటున్నసబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాదిలో 12 సిలిండర్లను సబ్సిడీతో పొందవచ్చని, ఈ సబ్సిడీ మొత్తం రూ.200 నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో దేశంలోని 9.5 కోట్ల మంది ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించింది. సబ్సిడీ పొడిగించడం వల్ల ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల భారం పడనుందని తెలిపింది.

నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మహిళలకు ఎల్పీజీ కనెక్షన్ సదుపాయం కల్పించింది. వారికి ఏటా 12 సిలిండర్లను సబ్సిడీపై అందజేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లు ఈ సబ్సిడీ అందజేస్తున్నాయి.