గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఓ అభూత కల్పన..:నాదెండ్ల

ప్రారంభమైన కంపెనీలనే మళ్లీ చూపిస్తున్నారని ఆరోపణ

nadendla-manohar

అమరావతి : జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఈరోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై తీవ్రంగా స్పందించారు. విశాఖ పెట్టుబడుల సదస్సు ఓ అంకెల గారడీ అని, అంతా అభూత కల్పన అని కొట్టిపారేశారు. ప్రారంభమైన కంపెనీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చూపించారని, రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న చేసిన 14 ప్రారంభోత్సవాల్లో 8 శ్రీసిటీలోనివేనని అన్నారు. కృష్ణపట్నం వద్ద స్టీల్ ప్లాంట్ కోసం గతంలోనే ఎంఓయూ చేసుకుని, ఇప్పుడు దాన్ని మరోసారి చూపించారని వివరించారు. తిరుపతి, విశాఖల్లో ఓబెయార్ సంస్థకు గతంలోనే భూములు కేటాయించగా, నిర్మాణాలు కూడా జరిగాయని, అయితే ఇప్పుడు విశాఖలో ఎంఓయూ చేసుకున్నారని, రూ.30 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రానికి రాజధాని లేదని, సరైన నాయకత్వం కూడా లేదని, ఇలాంటి ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో ఏ విధంగా నమ్మకం కలుగుతుందో చెప్పాలని నాదెండ్ల ప్రశ్నించారు. ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు పేరిట రెండ్రోజుల్లో రూ.175 కోట్ల ప్రజాధనాన్ని తగలేసిందని విమర్శించారు. “జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని, పారిశ్రామికవేత్తగా ఆయనకున్న అనుభవంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఎన్నికల ముందు ప్రజలు నమ్మారు. నాలుగేళ్ల పాలనలో అలాంటివేవీ జరగకపోగా, ఇప్పుడు చివర్లో ప్రజాధనం వృధా చేసి ఏం సాధించారు? జగన్ సీఎం అవగానే రిలయన్స్ సంస్థపై కక్షగట్టారు. తిరుపతిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. కేటాయించిన భూమి కూడా వెనక్కి తీసుకున్నారు. కానీ అదే రిలయన్స్ కు సంబంధించిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. ముఖేశ్ అంబానీ విశాఖ సదస్సుకు వచ్చారు సరే… రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ఆయన తన ప్రసంగంలో ఎక్కడైనా చెప్పారా?” అంటూ నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

ఇక, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డును ఇంకా మర్చిపోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వారి శాఖ విడుదల చేసిన ప్రకటనల సీఫుడ్ కోడిగుడ్లను కూడా కలిపేశారని ఆరోపించారు. సీఫుడ్ అంటే చేపలు, రొయ్యలు అని తెలుసని, మరి కోడిగుడ్డు ఆ జాబితాలోకి ఎలా చేరిందని నాదెండ్ల ప్రశ్నించారు. దేశంలోనే సీఫుడ్ ఎగుమతుల్లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని చెబుతున్నారని, ఇటువంటి మంత్రులు శాఖల్ని ముందుకు తీసుకెళుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. సమ్మిట్ లో ఒక్కరోజు హేమాహేమీలను తీసుకువచ్చి రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చూపించే ప్రయత్నాన్ని అర్థంచేసుకోవాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.