విదేశాలలో భారత్ ను అవమానించేలా మోడీయే మాట్లాడుతున్నారుః రాహుల్

బిజెపి నేతలకు తన మాటలను వక్రీకరించడం అలవాటేనని ఎద్దేవా

on-defaming-india-allegations-rahul-gandhi-points-to-pm

న్యూఢిల్లీః విదేశీ గడ్డపై భారతదేశ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించింది తాను కాదని, స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీయే ఆ పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 60, 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యమని ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనల సందర్భంగా వ్యాఖ్యానించారని రాహుల్ గుర్తుచేశారు. లండన్ లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాలలో మన దేశ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఇటీవల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించారు. ఇందులో భారత్ ను అవమానించేలా రాహుల్ మాట్లాడారంటూ బిజెపి నేతలు మండిపడుతున్నారు.

తన వ్యాఖ్యలను, మాటలను వక్రీకరించడం బిజెపి నేతలకు అలవాటేనని రాహుల్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రపంచ వేదికలపై మన దేశాన్ని కించపరుస్తున్నది మోడీనేనని చెప్పారు. భారతదేశం మొత్తం అంతులేని అవనీతితో నిండిపోయిందని విదేశాల్లో మోడీ చెప్పినట్లు తనకు గుర్తుందన్నారు. 2015 లో ప్రధాని మోడీ దుబాయ్, సౌత్ కొరియాలలో పర్యటించారని రాహుల్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా భారతదేశంలో గత ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత, తప్పుడు నిర్ణయాలతో దేశం ఇప్పటికీ ఇబ్బందిపడుతోందని మోడీ ఆరోపించారన్నారు. భారత్ లో పుట్టినందుకు చింతిస్తూ కొంతమంది యువత దేశం విడిచి వెళ్లిన రోజులు ఉన్నాయని సౌత్ కొరియాలో మోడీ మన దేశాన్ని విమర్శించారని ఆరోపించారు. విదేశాలలోనే కాదు.. మన దేశంలోనూ భారత్ ను తానెప్పుడూ అవమానించలేదని రాహుల్ గాంధీ చెప్పారు. ఇంతకుముందు అలా చేయలేదు, ఇకపైనా చేయబోనని రాహుల్ స్పష్టం చేశారు.