బూట‌క‌పు కేసుల‌తో త‌మ గొంతు నొక్కాల‌నే కేంద్ర ప్ర‌య‌త్నిస్తోంది : కార్తీ చిదంబ‌రం

న్యూఢిల్లీ : త‌మ గొంతు నొక్కాల‌నే ఉద్దేశంతోనే త‌న‌పై త‌న కుటుంబ స‌భ్యుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం బూట‌క‌పు కేసుల‌ను బ‌నాయిస్తోంద‌ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబ‌రం ఆరోపించారు. వీసాలు జారీ చేసేందుకు ముడుపులు తీసుకున్నార‌నే కేసులో సీబీఐ అధికారులు కొంద‌రు త‌న‌పై చేపట్టిన దాడుల్లో కీల‌క, వ్య‌క్తిగ‌త‌ ప‌త్రాల‌ను సీజ్ చేశార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాను స‌భ్యుడిగా ఉన్న ఐటీ పార్లమెంట‌రీ స్టాండింగ్ కమిటీకి చెందిన కీల‌క‌, అత్యంత గోప్య‌త పాటించాల్సిన..వ్య‌క్తిగ‌త ప‌త్రాల‌ను సీబీఐకి చెందిన కొందరు అధికారులు స్వాధీనం చేసుకున్నార‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు రాసిన లేఖ‌లో కార్తీ చిదంబ‌రం పేర్కొన్నారు.

చ‌ట్ట‌విరుద్ధ, రాజ్యాంగ విరుద్ధ చర్య‌ల్లో తాను బాధితుడిన‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 11 ఏండ్ల కింద‌ట త‌న‌కు ఏమాత్రం సంబంధం లేని భార‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై విచార‌ణ పేరుతో ఢిల్లీలోని త‌న నివాసంపై దాడులు చేశార‌ని చెప్పారు. ముడుపుల వ్య‌వ‌హారంలో కార్తీ చిదంబ‌రాన్ని ఢిల్లీలో వ‌రుస‌గా రెండోరోజూ సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. తాను అడ‌గ‌ద‌లుచుకున్న ప్ర‌శ్న‌ల కోసం రాసుకున్న డ్రాఫ్ట్ నోట్స్‌నూ సీబీఐ సీజ్ చేసింద‌ని చెప్పారు.

బూట‌క‌పు కేసుల‌తో త‌మ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు.సీబీఐ తీరు పార్ల‌మెంట్ స‌భ్యుడిగా త‌న హ‌క్కులు, గౌర‌వానికి భంగం క‌లిగించేలా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఒక కేసు త‌ర్వాత మ‌రొక త‌ప్పుడు కేసుబ‌నాయిస్తూ ప్ర‌భుత్వం త‌న‌నూ, త‌న కుటుంబం గొంతు నొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. ఇది ఎంపీగా త‌న హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డమేన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/