ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు ఆదివారం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు.. దాదాపు ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సీబీఐ టీం.. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియా రికార్డింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది. నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారలు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత గతంలో వాడిన సెల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. అవసరమైతే మళ్లీ కవితను ప్రశ్నిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. సీబీఐ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పూర్తిగా సహకరించాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ శ్రేణులు ఎవరూ ఇంటికి రావొద్దని కవిత సూచించడంతో ఆమె ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. మీడియా ప్రతినిధులు మినహా మరెవరూ ఆ ప్రాంతంలో కనిపించలేదు.