ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు

పోలీసులను బెదిరించిన కేసులో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై సంతోష్ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొయిన్​బాగ్​లో పర్యటించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఓ పోలీసుతో అనుచితంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని పాటించాలని, మోడల్‌కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం సమయం మించిపోతున్నందున ఆయన ప్రసంగాన్ని ఆపాలని సంతోష్ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌పై అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను సైగ చేస్తే ఈ ప్రదేశం నుంచి పరిగెత్తవలసి వస్తుందని హెచ్చరించారు. తాను ప్రసంగించడానికి ఇంకా ఐదు నిమిషాలు మిగి లి ఉందని, ఎవరూ నన్ను ఆపలేరు అని అన్నారు. దీంతో సంతోష్ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుమోటో కేసు కింద అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.