ర‌న్ వేపై రెండు ముక్కలైన కార్గో విమానం

జర్మన్ కు చెందిన‌ డీచ్‌ఎల్‌ బోయింగ్‌ 757 కార్గో విమానంలో స‌మ‌స్య‌

శాన్ జోస్ : ఓ కార్గో విమానం ర‌న్ వేపై రెండు ముక్క‌లైంది. జర్మన్ కు చెందిన‌ డీచ్‌ఎల్‌ బోయింగ్‌ 757 కార్గో విమానం కోస్టారికాలోని సాన్‌ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బ‌య‌లుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో పైలట్లు అత్య‌వ‌స‌ర‌ ల్యాండింగ్‌ కోసం ఎయిర్‌పోర్ట్‌ అనుమతి కోరగా, అందుకు అనుమ‌తి వ‌చ్చింది. ఎయిర్‌పోర్టుకు తిరిగి వ‌చ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది.

అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్‌ సమస్య తలెత్తింద‌ని, అందుకే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వివ‌రించారు. ల్యాండింగ్ స‌మ‌యంలో విమాన ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాలు ఉండ‌డంతో ముంద‌స్తు చ‌ర్య‌ల‌కు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు వివ‌రించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/