మణిపూర్ మహిళల నగ్న వీడియో వెనుక కుట్ర కోణం ఉందిః అమిత్ షా

పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర జరిగిందని వ్యాఖ్య

amit-shah

న్యూఢిల్లీః మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మహిళల నగ్న వీడియో విడుదల వెనుక కుట్ర ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఈ కుట్ర జరిగిందని మండిపడ్డారు. 1990వ దశకం నుంచి మణిపూర్ లో కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలు జరగుతున్నాయని చెప్పారు. మహిళను నగ్నంగా చిత్రీకరించి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మణిపూర్ లో పరిస్థితిని మరింత రెచ్చగొట్టడం కోసం ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారని చెప్పారు.

మరోవైపు మణిపూర్ ఘర్షణలకు సంబంధించి ఏడు కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించామని అమిత్ షా చెప్పారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసు కూడా వీటిలో ఉందని తెలిపారు. ఈ కేసుల విచారణ వేరొక రాష్ట్రంలో జరగాలని సుప్రీంకోర్టును కోరామని చెప్పారు.