జనసేనలో చేరిన ‘అత్తారింటికి దారేది’ నిర్మాత

‘అత్తారింటికి దారేది’ ఫేమ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీ లో చేరారు. చిత్రసీమకు , రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉండనే సంగతి తెలిసిందే. చిత్రసీమ నుండి రాజకీయ పార్టీ లు పెట్టి విజయం సాధించిన వారు కొంతమంది ఉంటె..పలు పార్టీలలో చేరి రాణిస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నడుపుతున్నారు. మరికొద్ది నెలల్లో ఏపీ లో ఎన్నికలు రాబోతుండడం తో చాలామంది తమ భవిష్యత్ ఏ పార్టీ లో బాగుంటుందో అలోచించి అందులో చేరుతున్నారు.

ఈ క్రమంలో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సోమవారం మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ లో చేరారు. పవన్ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదల సమయంలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌పై పవన్ కళ్యాణ్ కేసు పెట్టారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించి తనకు రావాల్సి పారితోషికాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ చెల్లించలేదని ఫిర్యాదులో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు ఇవ్వాల్సి బ్యాలెన్స్‌ను బీవీఎస్ఎన్ ప్రసాద్ చెల్లించారు. అయితే, పవన్ కళ్యాణ్ తనతో చాలా మంచిగా ఉండేవారని.. అలాంటిది ఆయన తనపై కేసు పెట్టడం బాధించిందని గతంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఆ పాత గొడవలన్నీ పక్కనబెట్టి జనసేన పార్టీలో చేరిపోయారు బీవీఎస్ఎన్ ప్రసాద్.

నిన్న సోమవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ధర్మయాగం, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, పవన్ ధర్మయాగం నిర్వహించిన యాగశాలను టాలీవుడ్ సినీ ప్రముఖులు సందర్శించారు. యాగశాలకు విచ్చేసినవారిలో దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత డీవీవీ దానయ్య, సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఉన్నారు. వీరంతా యాగశాలలో పూజల అనంతరం పవన్ తో సమావేశమయ్యారు.