వంగవీటి రాధాను కలిసిన ఎంపీ కేశినేని నాని

తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని..మాజీ ఎమ్మెల్యే , తెలుగుదేశం నేత వంగవీటి రాధాను కలిశారు. తనను చంపేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, రెక్కీ కూడా నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం వంగవీటి రాధా నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు. ఈరోజు సోమవారం ఎంపీ నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బెజవాడలో ఎప్పుడూ కులాల మధ్య గొడవలు లేవన్న నాని.. కొందరు స్వార్థపరులు వంగవీటి కుటుంబానికి అనుచరులుగా నటిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టారని దుయ్యబట్టారు. వంగవీటి కుటుంబం రాష్ట్రానికి ఓ సంపద అని.. 60వ దశకం నుంచి పేదవారికి అండగా నిలిచిన కుటుంబం వంగవీటిదని కేశినేని నాని గుర్తుచేశారు. డీజీపీ, సీపీ విజయవాడ నగరంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని…. పాత బెజవాడ రోజులు తీసుకురావద్దని కోరారు.

పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని హత్యా రాజకీయాలను ఆనాడు ఎన్టీఆర్,చంద్రబాబు ఎప్పుడు ప్రోత్సహించలేదని నాని అన్నారు. వంగవీటి రాధా మంచి వ్యక్తని..తాను నష్టపోతాడు కానీ…ఎవరిని రాధా ఇబ్బంది పెట్టడని ఎంపీ వ్యాఖ్యానించారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని ఎంపీ నాని డిమాండ్ చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను…. ఈ అంశం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తా అని అన్నారు.