రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన కారు ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొట్టడంతో బస్సు చక్రాలు ఊడిపోయి నిలిచిపోయింది. ఆ పక్కనే పెద్ద బావి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వేములవాడ రూరల్ మండలం పొశేట్టి పల్లి – నాగయ్య పల్లి గ్రామాల మధ్య బుధువారం చోటుచేసుకుంది. ఆర్మూర్‌ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్ వేములవాడ నుంచి ఆర్మూర్‌కు వెళ్తుండగా.. కరీంనగర్‌కు చెందిన ఓ కుటుంబం కారులో కథలాపూర్‌ నుంచి వేములవాడకు అతివేగంగా వెళ్తూ బస్‌ను ఢీ కొట్టింది. దీంతో బస్సు చక్రాలు ఊడిపోయి భారీ శబ్ధంతో కొంతదూరం వరకు వెళ్లి నిలిచిపోయింది.

బస్సు నిలిచిన సమీపంలోనే పెద్ద బావి ఉండడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆ సమయంలో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారు బెలూన్స్‌ తెరుచుకోవడంతో కారులో ఉన్న భార్య, భర్తతో పాటు 6 నెలల బాబు,18 నెలల పాపకు స్వల్పగాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న చందుర్తి సీఐ కిరణ్ కుమార్ తన వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తో రోడ్డంతా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించారు.