బండి సంజయ్ విడుదల : ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు

పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయినా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ..కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్‌ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. బుధవారం ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి హన్మకొండ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను బుధవారం రాత్రే కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో గురువారం సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు చేసింది.

దీంతో శుక్రవారం ఉదయం జైలు అధికారులు బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి విడుదల చేసారు. విడుదల అనంతరం మీడియా తో మాట్లాడాడారు. కేసీఆర్ ప్రభుత్వం ముందు మూడు డిమాండ్స్ ను బండి సంజయ్ ఉంచారు.

1) మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

2 ) TSPSC, టెన్త్ పేపర్ లీకేజీలపై సిట్టింగ్​ జడ్జితో విచారించాలి

3 ) ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు.

కల్వకుంట్ల కుటుంబమే లీకుల, లీక్కర్ వీరుల కుటుంబమని సంజయ్ ఆరోపించారు. ‘పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం ఎవరైనా లీక్ చేస్తారా..? ముందురోజు పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం ఎవరు లీక్ చేశారు..? పదోతరగతి పత్రాల లీక్‌ ఘటనను కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే దమ్ముందా..?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

పోస్టులు, పైసల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. కొందరు పోలీసు అధికారుల తీరుపై కిందిస్థాయి పోలీసులు బాధపడుతున్నారని చెప్పారు. వరంగల్ సీపీకి.. పేపర్ లీక్​కు.. మాల్ ప్రాక్టీస్​కు మధ్య ఉన్న తేడా తెలియదని దుయ్యబట్టారు. 20 మార్కులకు పాసయ్యే హిందీ పేపర్‌ను ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్నించారు. 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేస్తే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.

‘మీరిచ్చిన హామీలపై ప్రశ్నిస్తే చాలు.. మాకు పిచ్చి అంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారంతా పిచ్చివాళ్లని ప్రచారం చేస్తున్నారు. తాగు, తాగించు అనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానం. కేసీఆర్‌ కుమారుడు, కుమార్తె జైలుకు పోవడం ఖాయం. కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిని ప్రజలంతా గ్రహించారు. కేసీఆర్‌ కుటుంబ పాలన, దోపిడీ, అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు, స్టేషన్లు, జైళ్లు, లాఠీలు.. మాకు కొత్త కాదు. ఎంపీ పట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉంది’ అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను అభివృద్ది చేయడానికి పీఎం మోడీ సిద్దంగా ఉన్నారని, నిధులు కూడా కేటాయిస్తున్నారని, కానీ కేసీఆర్ ఆ నిధులును దారి మళ్లిస్తుండని సంజయ్ ఆరోపించారు.