త్వరలోనే ఏపీలో బీఆర్‌ఎస్ కార్యాలయం

తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్..ఇప్పుడు దేశాన్ని మరింత అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. మొన్నటి వరకు తెలంగాణకే పరిమితమైన పార్టీ ని ఇప్పుడు బీఆర్‌ఎస్ గా జాతీయ పార్టీ గా ఆవిర్భవించారు. 21 ఏళ్ల పార్టీ..60 లక్షల మంది పైగా కార్యకర్తలు ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ పేరు స్థానంలో బీఆర్ఎస్ గా ఇక కొనసాగనుంది. పార్టీ అధినేత – తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను నిన్న శుక్రవారం నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 1.20 గంటలకు ఆవిష్కరించారు. పార్టీ అధినేతగా బీఆర్ఎస్ పత్రాల పైన సంతకాలు చేసారు. పార్టీ నేతలందరికీ బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో బిఆర్ఎస్ ను విస్తరింపచేసేందుకు దృష్టి సారించారు.

అందులో భాగంగా ఏపీలోనూ బీఆర్‌ఎస్ కార్యాలయ ఏర్పాటకు సన్నాహాలు మొదలెట్టేశారు. విజయవాడలో పార్టీ ఆఫీస్ పెట్టనున్నారు. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవే సమీపంలో.. 800 గజాల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీలో పార్టీ ఆఫీసు నిర్మాణ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 18, 19వ తేదీల్లో మంత్రి తలసాని విజయవాడలో పర్యటించనున్నారు. జక్కంపూడికి వెళ్లి.. పార్టీ నిర్మాణాన్ని చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించనున్నారట.