పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణం:లోకేశ్

పాద‌యాత్ర‌ జ‌గ‌న్ స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది

అమరావతి: అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నార‌ని, వారికి సంఘీభావం తెల‌ప‌డానికి వ‌చ్చిన వారిని, మీడియానూ రానివ్వ‌ట్లేద‌ని టీడీపీ నేత‌ లోకేశ్ మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోతో పాటు ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర వైఎస్ జ‌గ‌న్
స‌ర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసుల్ని ప్ర‌యోగించి పాద‌యాత్ర‌కి అడుగ‌డుగునా ఆటంకాలు క‌ల్పించ‌డం న్యాయ‌మా? హైకోర్టు అనుమ‌తితో చేస్తున్న పాద‌యాత్ర‌కి ఖాకీల ఆంక్ష‌లు ఎందుకో?’ అని లోకేశ్ నిల‌దీశారు.

‘ఎండ‌న‌కా, వాన‌న‌కా ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధికి పాద‌యాత్ర‌గా వెళ్తుంటే, వారికి సంఘీభావం తెలప‌డ‌మూ నేర‌మా? క‌వ‌రేజ్‌కి వ‌చ్చిన‌ మీడియా ప్ర‌తినిధుల్ని ఎందుకు ఆపుతున్నారు? మహాన్యూస్ ఎండీ వంశీని పోలీసులు అడ్డుకోవ‌డాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని లోకేశ్ మండిప‌డ్డారు. ‘ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణం. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/