మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాష్

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్‌ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ రోజు (శనివారం) ప్రకాశ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం 2021, జూన్‌ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడింది. నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసి బాధ్యతలు అప్పగించనున్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాశ్ 1981 నుంచి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ నుంచి రాజ్యసభ ఎంపీ దాకా పని చేసారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బండా ప్రకాష్‌ 2018 మార్చిలో బీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఎంపీగా ఆరేండ్ల పదవీకాలం పూర్తికాకముందే.. 2021 నవంబర్‌ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. అనంతరం అదేఏడాది డిసెంబర్‌ మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.