బీజేపీ నేతల తీరును నిరసిస్తూ నల్ల చొక్కా ధరించి ప్రచారం చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ నేతల తీరును నిరసిస్తూ నల్ల చొక్కా ధరించి మునుగోడు ప్రచారంలో పాల్గొన్నారు టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బుధువారం హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా బిజెపి కొనుగోలు వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేసారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం పట్ల టిఆర్ఎస్ నేతలు బిజెపి తీరు ఫై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బుధువారం రాత్రి చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మంత్రుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నేతల తీరును నిరసిస్తూ నల్ల చొక్కా ధరించి ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నాయకులు తెర తీశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారని, అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లతో కొనాలని చూశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.