BRS Manifesto 2023 : ఓటర్లను ఆకట్టుకునేవి ఇవేనా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) నగారా మోగింది. నవంబర్ 30 న పోలింగ్..డిసెంబర్ 03 న ఫలితాలు అందించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో అధికార పార్టీ తో పాటు మిగతా అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్..ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే..ఆ ఛాన్స్ బిఆర్ఎస్ కు ఇవ్వకూడదని కాంగ్రెస్ , బిజెపి పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆకట్టుకునేలా మేనిఫెస్టో (Congress Manifesto) ను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించి ప్రజల్లో ఆసక్తి రేపగా..అతి త్వరలోనే మరికొన్ని హామీలను ప్రకటించి , ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ఇక గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ , బిజెపి మేనిఫెస్టో (BJP Manifesto) లను తలదన్నేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో (BRS Manifesto) ను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు…మేనిఫెస్టో తాలూకా లీకులు ఇస్తూ ప్రజల్లో ఆసక్తి రేపుతూ వస్తున్నారు.

హుస్నాబాద్ (Husnabad BRS Public Meeting)వేదిక గా మేనిఫెస్టో ప్రకటిస్తారని… ఆ తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయమంటూ అందరిలోనూ ఉత్కంఠను రేపుతున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని… మీరు కోరుకునే విధంగానే మేనిఫెస్టోలో పలు ప్రకటనలు ఉంటాయని, శుభవార్తలు వినేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీష్ రావు పలు సభ లో చెప్పుకొచ్చారు.

ఈ నెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్రి సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. అలాగే ఆరోజు సాయంత్రం హుస్నాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు, గ్యాస్ ధర తగ్గింపుపైనా బీఆర్ఎస్ హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆసరా పింఛన్లు ఎంత మేరకు పెంచాలి? గ్యాస్ ధరలను ఎంత మేర తగ్గించాలి? అన్న విషయంపై గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) కసరత్తు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొండెక్కి కూర్చున్న గ్యాస్ ధరను దాదాపు రూ.700లకు తగ్గించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాతనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఓటర్లను అత్యంత ఆకర్షించే అవకాశం ఉన్న ఈ పథకాలను వెంటనే ప్రకటిస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.