లోక్‌సభ ఘటన..తెలంగాణ అసెంబ్లీకి మూడంచెల రక్షణ.. కొత్త పాసుల జారీ నిలిపివేత

three-tier-protection-for-telangana-assembly

హైదరాబాద్‌ః పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా బుధవారం రోజున లోక్​సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకొచ్చిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అనూహ్య ఘటన నేపథ్యంలో తెలంగాణ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈరోజు జరగనున్న రాష్ట్ర శాసనసభ సమావేశాలకు పటిష్ఠ భద్రత కల్పించాలని శాసనసభ ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని సూచించారు.

ఈ మేరకు శాసనసభాపతి కార్యాలయంలో బుధవారం రోజున ప్రొటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు, కార్యదర్శి నరసింహాచార్యులు, డీజీపీ రవిగుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ.. శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఆ తరహా ఉదంతాలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. సమావేశాలు సజావుగా సాగేలా మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులను అక్బరుద్దీన్‌ ఆదేశించారు.