రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందిః కెటిఆర్
హైదరాబాద్‌ః తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అయితే, ఇది కాలం తెచ్చిన కరువు కాది, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో రైతులకు పుష్కలంగా సాగు నీటిని అందించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ మీద కోపంతో మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి, హైదరాబాద్ కి మధ్య తిరగడం తప్ప.. రైతులను పరామర్శించేందుకు సీఎం రేవంత్ కు సమయం లేదని అన్నారు.
ఇప్పటి వరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని… ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం అందించాలని చెప్పారు. ఎకరానికి రూ. 10 వేలు ఇస్తారో, రూ. 25 వేలు ఇస్తారో ఇవ్వండని అన్నారు. రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు కోసం కెసిఆర్ రూ. 7 వేల కోట్లు పెట్టిపోతే… ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా… కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కెటిఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.