‘చలో నల్గొండ’ను విజయవంతం చేయాలి: కెసిఆర్

కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్లగొండ నగరంలో ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసారు. సభ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. చలో నల్గొండ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి నేతలకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టులను KRMBకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాలను వివరించేలా సభ ఉంటుందని కేసీఆర్ వారికి వివరించారు.

కృష్ణా నది పై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడంతో జరగబోయే దుష్పరిణామాలను ఖండించారు. ఈ సభ కు సమన్వయకర్తలను నియమించారు. నల్లగొండ అసెంబ్లీ స్థానానికి సీనియ‌ర్ నేత‌ రవీందర్ సింగ్, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, హుజూర్ నగర్‌కు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, దేవర కొండ ఎమ్మెల్యే పంజాల గోపిరెడ్డి, మునుగోడు పార్టీ సీనియ‌ర్ నేత నందికంటి శ్రీధర్, మిర్యాలగూడకు పార్టీ నేత‌లు ఆదర్శ్ రెడ్డి, ముజీబ్, తుంగతుర్తికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కోదాడకు ఎమ్మెల్సీ రవీందర్ రావు, సూర్యాపేటకు మాజీ మంత్రి జోగు రామన్న, నాగార్జున సాగర్ కు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, కరీంనగర్ జిల్లాకు సీనియర్ నేత జీవీ రామకృష్ణారావు, భువనగిరికి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఆలేరుకు మాజీ ఎమ్మెల్యే కే విద్యాసాగర్ రావులను సమన్వయకర్తలుగా నియమించారు.