బిఆర్ఎస్ తో కలిసి రెండో సీట్లలో పోటీ చేయబోతున్న బీఎస్పీ

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ (BRS-BSP) కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించింది బిఆర్ఎస్ అధిష్టానం. నాగర్ కర్నూల్, హైదరాబాద్ ఎంపీ సీట్లకు గాను బీఎస్పీ పోటీ చేయబోతుంది.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి, దేశంలో బహుజనుల రక్షణ కోసం బీఎస్పీ, బీఆర్ఎస్ ఒప్పందం చారిత్రక అవసరమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘పొత్తులో భాగంగా నాగర్కర్నూల్, HYDలో బీఎస్పీ పోటీ చేయబోతోంది. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. రెండు పార్టీలు అన్ని స్థానాల్లో పరస్పర సహకారంతో మా లౌకిక కూటమి విజయదుందుభి మోగించబోతోంది’ అని ట్వీట్ చేశారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 5న బీఆర్‌ఎస్‌ అధినేతతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు దేశంలో సెక్యులర్‌ విలువలు క్షీణించడం, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ బలహీన పడటం, దళిత, నిమ్నవర్గాల అభ్యున్నతి తదితర అంశాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రంలో బీఎస్పీతో కలిసి పనిచేసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి అభ్యంతరంలేదని కేసీఆర్‌ స్పష్టంచేశారు.