వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ముద్రగడ, ఆయన కుమారుడు గిరికి వైసీపీ కండువా కప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పని చేశారు.

వైసీపీ లో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఏపీలో తీవ్రంగా నడిచింది. ఒకానొక సమయంలో జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది.. పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళతారని చర్చ నడిచింది. అయితే పవన్ తీరు నచ్చకపోవడంతో.. పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ముద్రగడ జనసేన పార్టీలోకి వెళ్లడం లేదని సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే వైసీపీ పద్మనాభంతో టచ్‌లోకి వెళ్లింది. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లా నేతలతో కలిసి ముద్రగడ పద్మనాభాన్ని కలిసి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన వైసీపీ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొని , ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ చేరిక తో వైసీపీ కి మరింత బలం పెరిగినట్లు అయ్యింది.