త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు – కేసీఆర్

తాను ఎవరికీ వ్యతిరేకిని కాదని, రైతు పక్షపాతినని , త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దేశంలో మార్పు రావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని, 75 ఏళ్లు అయినా దేశంలో నీళ్ల కోసం ఇంకా గొడవలు జరుగుతున్నాయిని కేసీఆర్ అన్నారు. దేశంలో అవసరానికి మించి జల సంపద ఉందని..అయినా వాటిని ఉపయోగించుకునేలా కేంద్రం పాలసీ తేవడం లేదన్నారు.

తాను ఎవరికీ వ్యతిరేకిని కాదని, రైతు పక్షపాతినని కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ను ఆదరించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు. ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేసియా వంటి దేశాలు అద్భుతాలు చేస్తుంటే, భారత్ మాత్రం ఎక్కడిదక్కడే ఉందని అన్నారు. దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడంలేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మరో 50 ఏళ్ల వరకు కూడా తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు లేవని కేంద్ర వాటర్ కమిషన్ ప్రకటించిందని..అయినా..కేంద్రం చేతకాని తనం వల్ల సాగునీరు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం యుద్దాలు జరగాలా ? అని ప్రశ్నించారు. మోడీకి అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై లేదా అని ప్రశ్నించారు.

దేశంలో అంత గొప్ప విధానాలు ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. యువత, మేధావులు, ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రోడ్లు సరిగా లేవు, రైళ్లు సరిగా లేవు, షిప్ యార్డులు సరిగా లేవని విమర్శించారు. భారత్ లో గూడ్స్ ట్రైన్ ఎంత వేగంతో వెళుతుందో పరిశీలించండి… ఆ విధంగా వెళితే అభివృద్ధి అనే గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటాం? మిగతా ప్రపంచంతో పోటీపడగలమా? అని పేర్కొన్నారు. భారత్ లో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లు అని, అదే చైనాలో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 120 కిలోమీటర్లు అని కేసీఆర్ వెల్లడించారు. ఈ విధంగా అయితే చైనాతో ఎప్పటికైనా పోటీపడగలమా? అని సందేహం వ్యక్తం చేశారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీలోనూ గూడ్స్ రైళ్ల సగటు వేగం భారత్ కంటే ఎక్కువని వివరించారు. దేశంలోని ట్రక్ స్పీడ్ కూడా ఇతర దేశాల కంటే తక్కువని అన్నారు. ఇలాంటివి పట్టించుకోకుండా విభజన రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తే దేశం ఎలా ముందుకు పోతుందని అన్నారు.

దేశంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఎందుకు జరగడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ ను సరఫరా చేశామన్నారు. లండన్, న్యూయార్క్ లో కరెంట్ పోయినా..హైదరాబాద్ లో కరెంట్ పోదన్నారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామన్నారు. దేశంలో 4 లక్షల 10 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని చెప్పారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు అత్యధికంగా 2 లక్షల 15వేల మెగా వాట్ల విద్యుతే ఉత్పత్తి చేసిందన్నారు. ఎక్కడా కూడా దేశంలో 24 గంటల విద్యుత్ ప్రజలకు అందడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రెండు మూడు గంటలు కూడా కరెంట్ ఉండదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

దేశంలో బీఆర్ఎస్ సర్కారు వస్తే మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశంలో ప్రతీ అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్ లో సీట్లు పెంచుతామని..వాటిని మహిళలకు కేటాయిస్తామన్నారు. ఏడాదిలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.